దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతన తెలంగాణ భవన్

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/డిసెంబర్ 19: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.

న్యూ ఢిల్లీ లోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ శ్రీ సంజయ్ జాజుతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు (41.68:58.32 నిష్పత్తి లో) వెళుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment