హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/17 జనవరి 2023 : భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పదవీకాలాన్ని పొడిగించారు. 2024 జూన్ వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నడ్డా సారథ్యంలోనే ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విలేకరులకు వెల్లడించారు.
దిల్లీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నడ్డా పదవీ కాలం పొడిగించేందుకు పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. అందుకు కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని అమిత్ షా చెప్పారు. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా నాయత్వంలో 2024 ఎన్నికల్లో భాజపా మరోసారి ఘన విజయం సాధించబోతోందని చెప్పారు. నడ్డా నాయకత్వంలో పలు రాష్ట్రాల్లో పార్టీ గెలుపొందని చెప్పారు.
జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తారన్న అంచనాలు ముందు నుంచీ ఉన్నాయి. గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన అమిత్‌షా విషయంలోనూ ఇదే జరిగింది. 2019కు ముందే షా పదవీ కాలం ముగియగా.. అప్పుడు జరిగిన కార్యవర్గ సమావేశాల్లో పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల తర్వాత జేపీ నడ్డాకు పార్టీ బాధ్యతలు అప్పగించారు.