G20 సదస్సులో కరీంనగర్ జిల్లాకు అరుదైన గౌరవం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్09:
G20 భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం, G20 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌జిల్లా కు అరుదైన గౌరవం దక్కింది.
ఈ సదస్సులో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల కళాత్మకం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు వెండి తీగతో ప్రత్యేకంగా రూపొందించిన ‘అశోక చక్ర’ బ్యాడ్జీలు దేశాధినేతల సూట్‌పై మెరవబోతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా కరీంనగర్ హస్తకళల సంక్షేమ సంఘంలోని సిల్వర్ ఫిలిగ్రీ నాలుగు నెలల క్రితమే కేంద్రం నుంచి ఈ తయారీ ఆర్డర్‌ను పొందింది. ఇందులో భాగంగానే సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు 200 అశోక చక్ర బ్యాడ్జీలను తయారు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.
9-10 తేదీల్లో శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యే ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులు వేసుకొనే కోటుకు ఈ బ్యాడ్జీలను ధరింపజేయనున్నారు. అంతర్జాతీయ సదస్సు కోసం వెండి బ్యాడ్జీలను రూపొందించే అవకాశం రావడం పట్ల కరీంనగర్ హస్తకళల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
అంతేకాదు.. జీ20 సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసుకునేందుకు వారికి అనుమతి లభించడం మరో విశేషం. జీ20 సమ్మిట్ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల కళాత్మక చేతి నైపుణ్య కళాఖండాలను ప్రదర్శించేందుకు భారత ప్రభుత్వం ఆహ్వానం అందించింది. ఇందులో భాగంగానే కరీంనగర్ నుంచి సిల్వర్ ఫిలిగ్రీ కళాత్మక వస్తువుల ప్రదర్శనలకు ప్రత్యేకంగా ఓ స్టాల్‌ను కేటాయించారు.
ఈ స్టాల్‌లో సిల్వర్ ఫిలిగ్రీ కొన్ని ప్రీమియం క్రియేషన్స్‌ను ప్రదర్శించబోతోంది. సదస్సుకు హాజరైన ప్రతినిధులు ఈ స్టాల్స్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది.