పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో..

Get real time updates directly on you device, subscribe now.

హరీష్ రాసిన పరీక్ష ఫలితాలను వెంటనే వెల్లడించండి: ధర్మాసనం

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 07:
పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీష్‌‌ను డీఈవో డీబార్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి హైకోర్టుకు వెళ్లగా.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులతో హరీష్ పదో పరీక్షలు రాశాడు.

అయితే పరీక్షలు పూర్తి అయి ఫలితాలు రాగా అధికారులు మాత్రం హరీష్ పదో తరగతి ఫలితాలను హోల్డ్‌లో పెట్టేశారు. ఫలితాలు వెళ్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును హరీష్ కోరారు. దీనిపై ఈరోజు విచారణ జరుగగా.. హరీష్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. వరంగల్ జిల్లాలోని కమలాపూర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్స్‌ప్‌లో లీక్‌ అవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే టెన్త్ విద్యార్థి హరీష్ నుంచి పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తేలడంతో విద్యార్థిని డీఈవో ఐదేళ్లపాటు డీబార్ చేశారు. తాను ఏతప్పు చేయలేదని తనను పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని హరీష్‌ ఎంతగానో విలపించాడు. చివరకు హరీష్ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని బెదిరంచడం వల్లే ప్రశ్నాపత్రం ఇతరులకు ఇచ్చాడని.. అదే వాట్సప్‌లో వచ్చిందని తెలిపారు.

తన కుమారుడిని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు హరీష్‌‌ను పదో తరగతి పరీక్ష రాసేందుకు అనుమతించింది. దీంతో హైకోర్టు తీర్పుపై విద్యార్థి హరీష్ హర్షం వ్యక్తం చేస్తూ మిగిలిన పరీక్షలు పూర్తి చేశాడు.

అయితే పదీ తరగతి ఫలితాలు విడుదల సమయంలో అధికారులు హరీష్ ఫలితాలను వెల్లడించకుండా హోల్డ్‌లో పెట్టాడు. దీంతో మరోసారి విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విద్యార్థిపై ఉన్న డీబార్‌ను కొట్టివేస్తూ.. వెంటనే ఫలితాలు వెల్లడించాలంటూ ఈరోజు గురువారం హైకోర్టు తీర్పునిచ్చింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment