ఫొటోలు అశ్లీలంగా మార్చి ఇన్‌స్టాలో పోస్టు.. ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
హ్యూమన్ రైట్స్ టుడే/నల్గొండ /సెప్టెంబర్ 06: వాట్సప్ అకౌంట్‌కు డీపీగా పెట్టుకున్న ఫొటోలు ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తెచ్చాయి. గుర్తుతెలియని ఆకతాయిలు వాటిని అశ్లీలంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన నల్గొండలో సంచలనమైంది..
పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు(19) జిల్లా కేంద్రంలోని ఓ వసతిగృహంలో ఉంటూ డిగ్రీ చదువుతున్నారు. వీరు ఇంటర్మీడియెట్ కలిసి చదువుకున్నప్పటి నుంచే స్నేహితులు. ఇటీవల పరీక్షలు రాసిన అనంతరం సెలవులు రావడంతో 20 రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారు.
మంగళవారం కళాశాలలో ల్యాబ్ పరీక్షలు ఉన్నాయని చెప్పి ఉదయం 9 గంటలకు నల్గొండకు చేరుకున్నారు. ఎన్జీ కళాశాల వెనుక భాగంలోని రాజీవ్ పార్కుకు వెళ్లారు. అక్కడే గంటకుపైగా ఉన్న తర్వాత వెంట తెచ్చుకున్న పురుగు మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకొని తాగేశారు. ఈ విషయాన్ని వసతిగృహంలో ఉన్న తమ స్నేహితురాలికి సమాచారం అందించారు.
అనంతరం గేటు బయట చెట్టు కిందకు వచ్చి పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకొని నల్గొండ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మార్ఫింగ్ చేసిన తమ చిత్రాలను ఇన్‌స్టాగ్రాంలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నల్గొండ టూ టౌన్ ఎస్సై నాగరాజు తెలిపారు.