చేతిలో కంకి కొడవలి, సుత్తి కొడవలి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 03:
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వాడివేడిగా నడుస్తున్నాయి. ముఖ్యంగా పొత్తుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యాండ్ ఇవ్వడంతో కామ్రేడ్లు అప్పటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు. దీంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్తో జత కట్టాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ను మరోసారి గద్దె ఎక్కకుండా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలనే అడుగులు వేసింది.
ఇందులో భాగంగానే ఇటీవల సీపీఐ, సీపీఎంల రాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే ఫోన్ చేసి మాట్లాడారు. వారితో థాక్రే రహస్య చర్చలు జరిపారనే టాక్ సైతం ఉంది. అయితే.. ఇప్పటివరకు పొత్తులపై మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఎవరికివారుగా మౌనమే ప్రదర్శిస్తున్నారు.
సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో ఉన్నారు.
దీంతో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు. కానీ.. పొత్తులపై టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మాత్రం బహిరంగంగా ఎలాంటి చర్చలు జరపలేదు. పొత్తులపై కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే కమ్యూనిస్టులు అడుగుతున్న అసెంబ్లీ సీట్లలో ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు ఫిక్స్ అయి ఉన్నట్లు తెలుస్తోంది.
పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం, వైరా, మధిర, హుస్నాబాద్, బెల్లంపల్లి, మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సీట్లను వామపక్షాలు అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. ఈ సెగ్మెంట్లలో కాంగ్రెస్కు బలమైన అభ్యర్థులు ఉన్నారని, ఆ స్థానాలను కమ్యూనిస్టులకు ఇస్తే ఎలా అని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం జరిగేలా ఉందని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే టీ కాంగ్రెస్ నేతలు పొత్తులపై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చేరికలపై దృష్టి పెట్టింది. తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిలపై అధిష్టానం దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల పోటీ చేశారు. షర్మిల ఒకవేళ కాంగ్రెస్లో విలీనం చేస్తే పాలేరు టికేట్ ఆశించే అవకాశం లేకపోలేదు.
మరోవైపు ఇటీవల కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాలేరు టికెట్ కోసం చూస్తున్నారు. కాంగ్రెస్లో కమ్యూనిస్టులు అడుతున్న ప్రతీ సెగ్మెంట్లో బలమైన నేతలు ఉన్నారు. కమ్యూనిస్టులా, చేరికలా అనే డైలామాలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మరోవైపు ఎవరి బలం ఎంత అని నేతలు బేరీజు వేస్తున్నారు. కాగా, కమ్యూనిస్టులు మాత్రం ఎవరితో పొత్తులు కుదరకపోతే బలమైన స్థానాల్లో ఉమ్మడిగా పోటీచేయాలని ఇదివరకే నిర్ణయించుకున్నారు.