హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 02:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ప్రభుత్వం తీపికబురు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వారికీ కరవుభత్యాన్ని చెల్లించాలని నిర్ణయించింది. దీన్ని తక్షణమే అమల్లోకీ తీసుకొచ్చింది. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి వారికి డీఏ చెల్లించనున్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది జనవరి నుంచి టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్న అయిదు శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
పెరిగిన డీఏ మొత్తాన్ని ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి ఉద్యోగులకు అందజేస్తామని అన్నారు. పెండింగ్‌లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని ఇదివరకే నిర్ణయించామని పేర్కొన్నారు.
సంస్థ ఆర్థిక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోన్నప్పటికీ.. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినప్పటికీఇప్పటివరకు ఉద్యోగులకు ఎనిమిది డీఏలను మంజూరు చేసినట్లు బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జాన్ గుర్తు చేశారు.
సంస్థను లాభాల బాట పట్టించడానికి ఆర్టీసీ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తోన్నారని, కష్టపడి పనిచేస్తోన్నారని వారు ప్రశంసించారు. బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని రకాల బకాయిలను సైతం విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు.
ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా నష్టాలను చవి చూస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీజిల్ ధరలు అసాధారణంగా పెరగడం వల్ల సంస్థ నష్టాలపాలవుతోందని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే విలీనం చేయడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థను ఆదుకున్నట్టవుతుందని భావించింది.