సెక్రటేరియట్ తుది దశ నిర్మాణ పనులు : మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ / 16 జనవరి 2023: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ తుది దశ నిర్మాణ పనులను సోమవారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా తిరిగి అక్కడే అధికారులు, వర్క్స్ ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన ద్వారం, పోర్టికో, అంతర్గత రోడ్లు, ఫౌంటైన్ల నిర్మాణం, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సీఎం బ్లాక్ 6వ ఫ్లోర్ వరకు కారిడార్లు, మంత్రుల చాంబర్స్, వర్క్ స్టేషన్లకు సంబంధించిన అన్ని రకాల పనులపై బ్లాకుల వారీగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు.
ఈ తరుణంలో సీఎం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ భవనానికి ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆలోగా నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని, అవసరమైన మేర మ్యాన్‌పవర్‌ను పెంచి పది రోజుల్లో బ్లాకుల వారీగా అన్ని రకాల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శశిధర్, శ్రీనివాస్, పలువురు ఆర్అండ్బీ అధికారులు, షాపూర్ పల్లోంజి నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.