*తూగో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- చిన్నారి సహా ఆరుమంది దుర్మరణం*
హ్యూమన్ రైట్స్ టుడే/రాజమండ్రి/జూన్ 12:
తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అతి వేగం ఓ నిండు కుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. వేగంగా వెళ్తోన్న కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టిన ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలను కోల్పోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.
తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలంలో ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన సంభవించింది. విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరిన కారు.. మార్గమధ్యలో నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. అతి వేగానికి అదుపు తప్పి.. లారీని వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న వారందరూ దుర్మరణం పాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.