హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 11:
తెలంగాణలో ఎన్నికల ముందే పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో తెలంగాణలో కీలక నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే పక్రియను వేగవంతం చేసింది. కాగా, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జూపల్లి కృష్ణారావు ఆదివారం భేటీ అయ్యారు.
ఇక, వీరి భేటీ అనంతరం కోమటిరెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని జూపల్లికి చెప్పాను. నల్లగొండలో 18 లేదా 19 తేదీల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుంది. ప్రియాంక సభ తర్వాత కాంగ్రెస్ అంటే ఏంటో చూడండి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీలో చేరతానో ఇంకా డిసైడ్ అవ్వలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పార్టీలో చేరే ముందు జూపల్లి ముఖ్య నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, నేడు కోమటిరెడ్డితో జూపల్లి భేటీ అయ్యారు.