హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 10:
వలస కూలీలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, పేదలు ప్రయాణించే జనరల్ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలంటే రైల్వేశాఖకు లెక్కే లేదు. అన్ని రైళ్లల్లో స్లీపర్ బోగీలు తగ్గించి ఏసీ బోగీలు పెంచాలనే లక్ష్యాన్ని రైల్వే నిర్ధేశించుకుంది. ఏదో ఉంచామంటే ఉంచాం అనే రీతిలో మొక్కుబడిగా ఒకటి లేదంటే రెండు బోగీలనే రైలుకు ఉంచుతోంది. దీనివల్ల దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎంతో కష్టనష్టాలకు గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతుంది. పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేయడమే కానీ తమదగ్గర ఏమీలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.
అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీల్లో ప్రయాణం చేయాలంటే ప్రజలకు ప్రత్యక నరకంలా మారింది. రిజర్వేషన్ లేకుండా సాధారణ టిక్కెట్ తీసుకొని ప్రయాణించాలనుకునే వారంతా ఈ రెండు బోగీల్లోనే సర్దుకోవాల్సి ఉంటుంది. రద్దీని తట్టుకోలేక బాత్ రూమ్ లో కూడా నిలబడి ప్రయాణిస్తున్నారు.
రైళ్లల్లో గతంలో ఉన్న స్లీపర్ బోగీలను తగ్గించి వాటిస్థానంలో ఏసీ బోగీలను క్రమంగా పెంచుతున్నారు. దీనివల్ల స్లీపర్ లో బెర్త్ దొరకడం గగనంగా మారింది. చివరకు బాత్రూంలు కూడా ప్రయాణికుల కు జనరల్ బోగీల్లా మారాయి.