ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు కృషి చేయాలి

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/కామారెడ్డి/ జూన్ 08:
ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. శ్రీదేవి అన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆవరణలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్ నిర్మూలనలో మహిళలు భాగస్వాములు కావాలని తెలిపారు. ప్రజలు తక్కువ దూరం ఉన్నచోట్లకు నడుచుకుంటూ వెళ్లాలని చెప్పారు. వాహనాల వాడకాన్ని తగ్గించి వాయు కాలుష్యం తగ్గించాలని చెప్పారు. కామారెడ్డి పట్టణంలో ఓ వీధిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ప్లాస్టిక్ నిర్మూలన 100% జరిగే విధంగా జిల్లా అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. ప్లాస్టిక్ నిర్మూలనలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలవాలని కోరారు.

స్టీల్ టిఫిన్లు, బట్ట, కాగితపు సంచులు వాడుకునే విధంగా రిసోర్స్ పర్సన్లు మహిళలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు వద్దన్నా వినకుండా వ్యాపార సంస్థలు, వీధి వ్యాపారులు వినియోగిస్తే ఆకస్మికంగా దాడులు చేసి కోర్టు ద్వారా జరిమానాలు విధిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లు నిర్మూలన పై పట్టణంలో విస్తృతంగా రిసోర్స్ పర్సన్ లు ప్రచారం చేయాలని తెలిపారు. చెత్త బండి రాకపోతే ప్రజలు రోడ్లపై చెత్త వేయడం వల్ల చెత్త మురుగు కాలువల్లోకి వెళ్తోందన్నారు. దోమలు, ఈగలు వృద్ది చెంది వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సూచించారు. వాతావరణ కాలుష్యం నుంచి భూమిని రక్షించాలని పేర్కొన్నారు. వస్త్ర సంచులను వాడాలని కోరారు. ప్లాస్టిక్ కవర్ల కాల్చివేతను పూర్తిగా నిర్మూలించాలని పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment