జాతకం చూస్తానని..రూ.2.65 లక్షలతో ఉడయించాడు
నందిగామ మండలం ఈదులపల్లి లో ఘటన
హ్యూమన్ రైట్స్ టుడే:
శ్రీశైలం నుంచి వచ్చిన స్వామీజీని.. మీ జాతకం చూస్తాను అని ఓ కుటుంబాన్ని బురిడీ కొట్టించి రూ.2.65 లక్షలతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు.
నందిగామ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన సునీత(25) ఇంటికి రెండు నెలల క్రితం ఓ వృద్ధుడు వచ్చి తన పేరు రాములు అని మీ జాతకం చూస్తానని మొదట 15000 తీసుకున్నాడు. సదరు మహిళ డబ్బులు ఇవ్వడంతో అమాయకత్వాన్ని గమనించిన ప్రబుద్ధుడు మరో పథకం వేశాడు. మీ భర్తకు ప్రాణహాని ఉందని, మీ ముగ్గురు ఆడ పిల్లల మంచి కోసం పరిహారం పూజలు చేయాలని నమ్మబలికాడు. అంతేకాకుండా మీ ఇంట్లో బంగారు నిధులు ఉన్నాయని బయటకు తీసేందుకు 2.50 లక్షల ఖర్చు అవుతుందని చెప్పాడు. నమ్మిన సునీత మొత్తం రూ.2.65 లక్షలు ఇచ్చింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెబితే నీ భర్త ప్రాణాలకు గండం ఉంటుందని నమ్మించాడు. ఒకే రోజులో తన పని ముగించుకొని ఒక నెలలో తిరిగి వచ్చి బంగారు నిధులు తీస్తానని వెళ్లిపోయాడు.. నెల తర్వాత రాకపోవడంతో సునీత వృద్ధుడు ఇచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసింది. అతను ఇప్పుడు లేడు అని బదులు రావడంతో తాను మోసపోయినట్లు భావించి నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.