హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : రెండు వేల రూపాయల నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకుంటా మంటూ రిజర్వు బ్యాంకు ప్రకటన చేసిన నిమిషాల వ్యవధిలోనే హైదరాబాద్‌లోని దుకాణాల్లో ఆ నోటును తీసుకోవడం నిలిచిపోయింది. షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్, పెట్రోలు బంకుల్లో నోటును తీసుకోడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు నేరుగా తీసుకునే వెసులుబాటు ఉన్నా తీసుకోడానికి సుముఖంగా లేరు.
సెప్టెంబరు 30వ తేదీ వరకు లీగల్‌గా చెలామణి చేసుకునే అవకాశం ఉన్నా దుకాణాలు సిద్ధపడడంలేదు. మద్యం దుకాణాల్లో సైతం ఈ నోటు తీసుకోడానికి ఆసక్తి చూపడంలేదు. సూపర్ మార్కెట్లలో సైతం ఇదే ధోరణి వ్యక్తమవుతున్నది. ఈ నోటును తీసుకుంటే మళ్ళీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే సమయంలో చిక్కులు వస్తాయన్న అనుమానమే ఇందుకు కారణం. వ్యాపార లావాదేవీల్లో భాగంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోడానికి ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ రిస్కు ఉంటుందేమో అనే అనుమానంతో నోటును తీసుకోడానికి ఇష్టపడడంలేదు.