భూ తగాదాలే కారణమా ❓️
హ్యూమన్ రైట్స్ టుడే/మంచిర్యాల /మే 20:
ఓ మహిళను పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఆమెను పదునైన కత్తులతో నరికి చంపి పరారీ అయ్యారు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా రాజీవ్‌నగర్‌కు చెందిన వేల్పుల స్వప్న(26)కు 2016లో వేల్పుల మధుకర్‌తో వివాహమైంది. అయితే ఆమె మధుకర్ నుంచి విడాకులు తీసుకోని మరొకరిని వివాహం చేసుకుంది. అయితే మధుకర్, స్వప్న మధ్య గత కొంతకాలం నుంచి భూవివాదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ వివాదాల కారణంగానే శుక్రవారం మధ్యాహ్నం స్వప్నను ఒంటరిగా చిక్కించుకొని, ఆమెపై మధుకర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ముఖంపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయింది. అందరూ చూస్తుండగానే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
స్వప్నను హత్య చేసిన నిందితులు ముగ్గురు కలిసి ఒకే బైక్‌పై కోటపల్లికి వెళ్తుండగా పోలీసులు అడ్డగించి, అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.